ప్రెస్ క్లబ్ జాబితా ఇచ్చే అధికారం ఎవరిచ్చారు..?
General

ప్రెస్ క్లబ్ జాబితా ఇచ్చే అధికారం ఎవరిచ్చారు..?

Saturday, 7 November 20262 views

అధ్యక్షుడి నిర్ణయమే ప్రామాణికమా..?

జాబితాలో పేర్లు లేని జర్నలిస్టుల పరిస్థితి ఏమిటి?

ఏడాది దాటినా ప్రెస్ క్లబ్ వ్యవహారంపై స్పష్టత కరువు.. అధికార పరిధిపై ప్రశ్నలు

నవభారత్ నిర్మల్ నవంబర్ 06

జర్నలిస్టుల ఐక్యత, పరస్పర సహకారం, వృత్తిపరమైన గౌరవం కోసం ఏర్పడిన ప్రెస్ క్లబ్.. ఇప్పుడు కొందరు జర్నలిస్టులకు సమాచారం అందే మార్గంలో అడ్డంకిగా మారుతోందా..? జర్నలిస్టులందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించాల్సిన వేదికలోనే కొందరికి చోటు లేకుండా పోవడానికి కారణమేంటి..? ప్రెస్ క్లబ్ పేరుతో అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలకు అందిస్తున్న జర్నలిస్టుల జాబితాకు ప్రాతిపదిక ఏమిటి..? ఆ జాబితాను రూపొందించి ఇతరులకు అందించే అధికారం ఎవరిచ్చారు..? అనే ప్రశ్నలు నిర్మల్ పట్టణ జర్నలిస్టు వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. నిర్మల్ పట్టణ ప్రెస్ క్లబ్ ఏర్పడి ఏడాది దాటింది. అయితే ప్రెస్ క్లబ్ ఏర్పాటుతో జర్నలిస్టులందరికీ ఒక ఉమ్మడి వేదిక ఏర్పడిందని భావించిన వారికి ప్రస్తుతం ఎదురవుతున్న పరిస్థితులు భిన్నమైన అనుభవాన్ని కలిగిస్తున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యాపారవేత్తలు వివిధ సందర్భాల్లో జర్నలిస్టుల వివరాలు, ప్రెస్ క్లబ్ జాబితా అడుగుతున్నప్పుడు అధ్యక్షుడు ఒక జాబితాను అందిస్తున్నారనే సమాచారం ఉంది. అయితే ఆ జాబితాలో కొందరు స్టాఫ్ రిపోర్టర్ల పేర్లు లేకపోవడం ఇప్పుడు ప్రధాన చర్చకు దారితీస్తోంది. అంతేకాకుండా నిర్మల్ పట్టణ ప్రెస్ క్లబ్ పరిధిని దాటి జిల్లాలోని వివిధ మండలాల రిపోర్టర్ల పేర్లు కూడా ఆ జాబితాలో ఉండటం గమనార్హం.

అధ్యక్షుడి జాబితానే అధికారికమా...?

ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైనంత మాత్రాన జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరి వృత్తిపరమైన గుర్తింపును నిర్ణయించే అధికారం లభిస్తుందా...? ప్రెస్ క్లబ్‌కు సంబంధించిన అంతర్గత సభ్యుల జాబితాను నిర్వహించడం ఒక అంశమైతే, పట్టణం, మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల వివరాలను ఇతరులకు అందించడం మరో అంశం. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రెస్ క్లబ్ రాజ్యాంగం, నిబంధనలు, సభ్యత్వ ప్రక్రియ ఆధారంగా అధ్యక్షుడి అధికార పరిధి నిర్ణయించబడాలి. కానీ ఆ పరిధిని దాటి ఎవరు జర్నలిస్టు, ఎవరు కాదనే భావన కలిగించేలా జాబితాలు అందిస్తే దాని పరిణామాలకు బాధ్యత ఎవరు వహిస్తారు..? జిల్లాలోని జర్నలిస్టుల వివరాలు అధికారికంగా అవసరమైనప్పుడు సమాచార పౌర సంబంధాల శాఖ (డీపీఆర్ఓ) వద్ద ఉన్న గుర్తింపు, అక్రిడిటేషన్ వివరాలు, సంబంధిత పత్రాల ఆధారంగా తెలుసుకోవచ్చు కదా..? మరి ఒక పట్టణ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అందించిన జాబితానే కొందరికి ప్రామాణికంగా మారుతోందా..? ఆ జాబితా రూపొందించడానికి అనుసరించిన ప్రమాణాలేమిటి? అందులో పేర్లు లేని స్టాఫ్ రిపోర్టర్లకు సమాచారం అందకపోతే దానికి బాధ్యత ఎవరిది?

పేర్లు లేకపోతే సమాచారం కూడా లేదా..?

జర్నలిజం అనేది ఒక సంఘం సభ్యత్వానికి పరిమితమైన వృత్తి కాదు. వివిధ పత్రికలు, ఛానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులు తమ సంస్థల తరఫున నిత్యం వార్తా సేకరణ చేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తుంటారు. వారిలో కొందరు ప్రెస్ క్లబ్ సభ్యులై ఉండవచ్చు. మరికొందరు సభ్యత్వం తీసుకోకపోయినా వృత్తిలో కొనసాగుతూ ఉండవచ్చు. అలాంటప్పుడు ప్రెస్ క్లబ్ జాబితాలో పేరు లేదనే కారణంతో వారికి సమాచారం అందించే విషయంలో వివక్ష చూపడం ఎంతవరకు సమంజసం..? ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలకు సంబంధించిన సమాచారం కొందరికే పరిమితం కావాలా..? జాబితాలో పేరున్న వారికే సమాచారం అందించి, మిగతావారిని పక్కన పెట్టే పరిస్థితి ఏర్పడితే అది జర్నలిస్టుల మధ్య విభజనకు దారితీయదా..? ఒక పత్రికలో స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేస్తూ నిత్యం వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టు పేరు జాబితాలో లేకపోతే అతని వృత్తిపరమైన గుర్తింపుపై అనవసరమైన సందేహాలు తలెత్తే అవకాశం ఉంది. ఒకరి పేరును చేర్చడం, మరొకరి పేరును మినహాయించడం వెనుక ప్రాతిపదిక ఏమిటి..? సంస్థల నుంచి వివరాలు సేకరించారా..? జర్నలిస్టుల పని విధానం, నియామక పత్రాలు, సంస్థల గుర్తింపు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారా..? లేక అందుబాటులో ఉన్న కొందరి వివరాలతోనే జాబితా రూపొందించారా..? ఈ ప్రశ్నలకు స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.

పట్టణ ప్రెస్ క్లబ్.. జిల్లా జర్నలిస్టులపై పెత్తనమా..?

నిర్మల్ పట్టణంలో ఏర్పాటైన ప్రెస్ క్లబ్ పరిధి పట్టణానికే పరిమితమా..? లేక జిల్లాలోని అన్ని మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల ప్రాతినిధ్యాన్ని కూడా నిర్ణయించే బాధ్యత ఉందా..? పట్టణ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడికి జిల్లాలోని మండలాల రిపోర్టర్ల పేర్లతో జాబితా రూపొందించి ఇతరులకు అందించే అధికారం ఏ నిబంధనల ప్రకారం సంక్రమించింది..? ప్రెస్ క్లబ్ సభ్యుల జాబితా ఇవ్వడం వేరు.. జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టుల జాబితా ఇవ్వడం వేరు. ఈ రెండింటినీ ఒకటిగా పరిగణించడం ఎంతవరకు సమంజసం..? ఒకవేళ ప్రెస్ క్లబ్ సభ్యుల జాబితాను మాత్రమే అందిస్తుంటే దానిని స్పష్టంగా సభ్యుల జాబితాగా పేర్కొనాలి. కానీ పట్టణ ప్రెస్ క్లబ్ పరిధిని దాటి జిల్లాలోని మండలాల రిపోర్టర్ల పేర్లతో కూడిన జాబితాను అందించినప్పుడు దాని ప్రాతిపదిక ఏమిటో వెల్లడించాలి. సభ్యత్వం లేని వారిని జాబితాలో చేర్చకపోవడం ఒక అంశమైతే, సభ్యత్వం లేని కారణంగా వారిని జిల్లా జర్నలిస్టుల జాబితా నుంచి మినహాయించినట్లుగా భావన కలిగించడం మరో అంశం. ఈ విషయంలో స్పష్టత అవసరం.

ప్రెస్ క్లబ్ ఎవరి సొంత వ్యవహారం కాదు...!

ప్రెస్ క్లబ్ అనేది జర్నలిస్టుల మధ్య సమన్వయం పెంచే వేదికగా ఉండాలి. కానీ జాబితాలో పేరు ఉండటం, లేకపోవడం ఆధారంగా ప్రాధాన్యతలు మారుతున్నాయనే అభిప్రాయం ఏర్పడితే ఆ వేదిక ఉద్దేశమే ప్రశ్నార్థకమవుతుంది. అధ్యక్ష పదవి అనేది సేవ చేయడానికి, జర్నలిస్టుల సమస్యలపై పోరాడడానికి, అందరినీ కలుపుకొని వెళ్లడానికి లభించే బాధ్యత. ఆ పదవిని ఉపయోగించి ఎవరికి గుర్తింపు ఇవ్వాలి..? ఎవరిని జాబితాలో చేర్చాలి..? ఎవరిని మినహాయించాలి..? అనే నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటే సంస్థాగత పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తడం సహజం. ప్రెస్ క్లబ్‌లో సభ్యత్వం ఉన్నవారు, లేనివారు అనే తేడా ఉండవచ్చు. కానీ వృత్తిపరంగా జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారందరినీ ఒకే గాటన కట్టి, కొందరిని మాత్రమే గుర్తించే పరిస్థితి ఉండకూడదు. ఒకరి చేతిలో ఉన్న జాబితా ఆధారంగా మరొకరి వృత్తిపరమైన గుర్తింపు ప్రభావితమయ్యే పరిస్థితి ప్రజాస్వామ్యబద్ధమైన జర్నలిస్టు వ్యవస్థకు ఎంతవరకు సమంజసం..? అధ్యక్షుడి నిర్ణయమే అంతిమమైతే మిగతా జర్నలిస్టుల అభిప్రాయానికి విలువ ఎక్కడుంది..?

పారదర్శకత ఎక్కడ..? సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా..?

ప్రెస్ క్లబ్ ఏర్పాటు సమయంలో రూపొందించిన నియమావళి ఏమిటి..? సభ్యత్వానికి అర్హతలు ఏమిటి..? సభ్యుల జాబితా ఎప్పుడు ఖరారు చేశారు? జాబితాలో మార్పులు చేర్పులకు అవకాశం ఉందా...? అధ్యక్షుడికి ఏయే అధికారాలు ఉన్నాయి.? జిల్లాలోని మండలాల జర్నలిస్టుల వివరాలను సేకరించడానికి ఏ విధానాన్ని అనుసరించారు..? జాబితాలో పేర్లు లేని స్టాఫ్ రిపోర్టర్లకు సభ్యత్వం లేదా ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉందా..? అనే అంశాలను స్పష్టం చేయాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు జర్నలిస్టుల వివరాలు అడిగినప్పుడు ఒక జాబితా అందించడం సులభమే. కానీ ఆ జాబితాలో పేర్లు లేని జర్నలిస్టుల పరిస్థితి ఏమిటి..? వారికి సమాచారం అందకపోతే ఎవరు బాధ్యత వహిస్తారు..? ఒక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అందించిన జాబితానే జిల్లాలోని జర్నలిస్టులందరి ప్రాతినిధ్యాన్ని నిర్ణయించే స్థాయికి చేరితే మిగతా జర్నలిస్టుల వృత్తిపరమైన స్వేచ్ఛ, గుర్తింపుకు విలువ ఎక్కడ ఉంటుంది..? జర్నలిస్టుల ఐక్యత పేరుతో ఏర్పడిన సంస్థలోనే కొందరికి గుర్తింపు, మరికొందరికి నిర్లక్ష్యం అనే భావన కలగడం మంచిది కాదు. ప్రెస్ క్లబ్ అనేది ఎవరి వ్యక్తిగత సంస్థ కాదు. అది సభ్యుల సమిష్టి వేదిక. అధ్యక్ష పదవి అనేది అధికార ప్రదర్శనకు వేదిక కాదు.. బాధ్యతను గుర్తుచేసే హోదా. పట్టణ ప్రెస్ క్లబ్ పరిధి ఎంత..? అధ్యక్షుడి అధికారాలు ఎంతవరకు..? అనే అంశాలపై స్పష్టత రావాల్సిందే. ఎందుకంటే ఒక జాబితాలో పేరు లేకపోయినంత మాత్రాన ఒక జర్నలిస్టు ఉనికి చెరిగిపోదు.. ఒకరి నిర్ణయంతో జిల్లాలోని జర్నలిస్టులందరి ప్రాతినిధ్యం ఖరారు కాదు.

Share this article

Related Articles