
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిల్లా ఇంటర్మీడియట్ అధికారి
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిల్లా ఇంటర్మీడియట్ అధికారి
కాలేజీకి అనుకూలంగా నివేదిక ఇస్తానంటూ రూ.50 వేల డిమాండ్
ఇప్పటికే రూ.30 వేలు.. మిగిలిన రూ.20 వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవభారత్, సెప్టెంబర్ 9
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో లంచం తీసుకుంటూ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. కాలేజీకి అనుకూలంగా నివేదిక ఇవ్వాలంటూ డబ్బులు డిమాండ్ చేసిన అధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.
సంగారెడ్డి జిల్లాలోని ఓ కాలేజీని కొద్ది రోజుల క్రితం జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్‌రాం తనిఖీ చేసినట్లు సమాచారం. తనిఖీల్లో కాలేజీలో చిన్నచిన్న లోపాలు, ఇతర అంశాలను గుర్తించిన ఆయన.. వాటిని సరిచేసి కాలేజీకి అనుకూలంగా నివేదిక ఇవ్వాలంటే రూ.50 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.దీంతో చేసేది లేక కాలేజీ యాజమాన్యం ముందుగా రూ.30 వేల నగదును అధికారికి ఇచ్చినట్లు సమాచారం. మిగిలిన రూ.20 వేలు కూడా ఇవ్వాలని అధికారి ఒత్తిడి చేయడంతో కాలేజీ యాజమాన్యం ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. కార్యాలయంలోనే పట్టివేత బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని తన కార్యాలయంలో గోవింద్‌రాం మిగిలిన రూ.20 వేల లంచాన్ని బాధితుల నుంచి స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం ఆయనపై కేసు నమోదు చేసి, లంచం డిమాండ్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు చేపట్టారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌తో పాటు ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. లంచం డిమాండ్ చేస్తే సమాచారం ఇవ్వండి ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీకి సమాచారం అందించాలని సూచించారు. అవినీతికి పాల్పడే అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Share this article



